ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కుదిరిన ఒప్పందంపై హెజ్‌బొల్లా మరోసారి వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ ఒప్పందం తమకు ఆమోదయోగ్యం కాదని, దాన్ని కూల్చివేయాలని హెజ్‌బొల్లా చీఫ్ నయీమ్ ఖాసెమ్ స్పష్టం చేశారు.
జూన్ 26న అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో హెజ్‌బొల్లా ఆయుధాలను వదిలేయడం, దక్షిణ లెబనాన్ నుంచి ఇజ్రాయెల్ దళాలను దశలవారీగా ఉపసంహరించుకోవడం వంటి అంశాలు ఉన్నాయి. తొలి దశలో కొన్ని ప్రాంతాలను పైలట్ జోన్లుగా గుర్తించి హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను తొలగించే చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
అయితే ఈ విధానాన్ని నయీమ్ ఖాసెమ్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ ఒప్పందం చట్టవిరుద్ధమని, లెబనాన్ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందని ఆరోపించారు. పైలట్ జోన్ల ఏర్పాటు, పర్యవేక్షణ వ్యవస్థను కూడా అంగీకరించబోమని స్పష్టం చేశారు. “మేం తలవంచం.. లొంగిపోం” అని వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉండగా దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడులు, కాల్పులు కొనసాగుతున్నాయని బీరుట్ ఆరోపిస్తోంది. ఇజ్రాయెల్ సైన్యం ఉపసంహరణకు స్పష్టమైన హామీ లేకుండా హెజ్‌బొల్లా నిరాయుధీకరణకు అంగీకరించడం కష్టమని తెలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో జరగాల్సిన తదుపరి చర్చలపై కూడా అనిశ్చితి నెలకొంది.
ఇజ్రాయెల్-లెబనాన్ ఒప్పందానికి హెజ్‌బొల్లా మరోసారి నో.. లొంగేది లేదని స్పష్టం
1
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan