మెగా డీఎస్సీ వివాదం.. జగన్ ఆరోపణలపై వర్ల రామయ్య తీవ్ర విమర్శలుమెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలపై టీడీపీ ఎమ్మెల్సీ వర్ల రామయ్య తీవ్రంగా స్పందించారు. ఈ ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆయన విమర్శించారు.
కృష్ణా జిల్లా గుడివాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ.. మెగా డీఎస్సీ నియామక ప్రక్రియను ప్రభుత్వం పూర్తి పారదర్శకంగా నిర్వహించిందని తెలిపారు. ఈ ప్రక్రియకు సంబంధించిన వివరాలను సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆధారాలతో సహా వెల్లడించారని చెప్పారు.
డీఎస్సీపై వైసీపీ దాఖలు చేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టివేసిందని, దీంతో వాస్తవాలు స్పష్టమయ్యాయని ఆయన పేర్కొన్నారు. తప్పులు జరిగాయని భావిస్తే అధికారులను కలిసి వివరాలు తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ వైసీపీ అలా చేయకుండా రాజకీయ ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు.
మంత్రి నారా లోకేశ్ బహిరంగ చర్చకు రావాలని, అసెంబ్లీలోనైనా తన అనుమానాలను నివృత్తి చేసుకోవాలని జగన్‌కు సవాల్ విసిరారని వర్ల రామయ్య గుర్తుచేశారు. కానీ దీనిపై జగన్ నుంచి స్పందన లేదని విమర్శించారు.
ప్రజల్లో గందరగోళం సృష్టించడం, ప్రభుత్వంపై బురదజల్లడం వైసీపీ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం చేపట్టిన నియామకాలు, విధానాలపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
గ్రూప్-1 పరీక్షల వ్యవహారంపై కూడా సిట్ నివేదిక ఇచ్చిందని, న్యాయపరమైన ప్రక్రియలో వాస్తవాలు బయటపడతాయని వర్ల రామయ్య తెలిపారు. విలువలు, విశ్వసనీయత కోల్పోయే విధంగా వ్యవహరిస్తే రాజకీయంగా నష్టపోవాల్సి వస్తుందని జగన్‌పై విమర్శలు చేశారు.
మెగా డీఎస్సీపై జగన్ ఆరోపణలు అవాస్తవం.. ప్రజలను గందరగోళానికి గురిచేయడమే వైసీపీ పని: వర్ల రామయ్య
10
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla
📍 ఆంధ్రప్రదేశ్