హైదరాబాద్‌లో ఆహార కల్తీపై కొనసాగుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా H-FAST అధికారులు మసాలాల తయారీ, విక్రయ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. నగరంలోని 13 వ్యాపార సంస్థలను తనిఖీ చేసి 25.3 టన్నుల కల్తీ మసాలాలు, 89.15 టన్నుల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ వ్యవహారంలో మూడు కేసులు నమోదు చేసి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
వాము, జీలకర్ర, లవంగం, షాజీరా, ఆవాలు సహా వివిధ మసాలాల్లో నాణ్యత లేని పదార్థాలను కలిపినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఫ్యాబ్రిక్ డైలు, సింథటిక్ రంగులు, పారిశ్రామిక డైలు, టాల్కమ్ పౌడర్, రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగించి మసాలాలకు ఆకర్షణీయమైన రంగు, మెరుపు తీసుకొచ్చినట్లు ప్రాథమిక తనిఖీల్లో గుర్తించారు. సాధారణ వినియోగదారులు నాణ్యమైన ఉత్పత్తులుగా భావించేలా వాటిని ప్యాక్ చేసి విక్రయించినట్లు పోలీసులు తెలిపారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, కల్తీ ఆహారం ప్రజారోగ్యానికి తీవ్రమైన ముప్పని హెచ్చరించారు. ఇలాంటి పదార్థాల వినియోగం వల్ల అలర్జీలు, జీర్ణ సమస్యలు, కాలేయం, మూత్రపిండాలపై ప్రతికూల ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉందన్నారు. అయితే స్వాధీనం చేసిన నమూనాలను ప్రయోగశాలకు పంపినందున, వాటిలో ఉన్న రసాయనాలు మరియు వాటి స్థాయిలపై తుది నిర్ధారణ పరీక్షా నివేదికల తర్వాతే వెల్లడవుతుంది.
సజ్జనార్ వెల్లడించిన వివరాల ప్రకారం, H-FAST ఏర్పాటైన 140 రోజుల్లో 659 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. మొత్తం 202 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసి, సుమారు 246 టన్నుల కల్తీ లేదా నాణ్యత లేని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. పునరావృతంగా కల్తీకి పాల్పడే వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయడంతోపాటు, సంబంధిత చట్టాల కింద కఠిన చర్యలు చేపడతామని హెచ్చరించారు. కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని గతంలోనూ హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు.
ఫ్యాబ్రిక్ డైతో మసాలాల కల్తీ.. హైదరాబాద్‌లో 25.3 టన్నులు స్వాధీనం
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan