కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ కుప్పం తన రాజకీయ జీవితంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు. ఏ పని చేపట్టినా కుప్పం నుంచే నాంది పలుకుతామని, కుప్పాన్ని మోడల్ నియోజకవర్గంగా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా కుప్పానికి నీరు తీసుకువచ్చి 133 చెరువులను నింపగలిగామని చంద్రబాబు తెలిపారు. భవిష్యత్‌లో యామిగానిపల్లి, మనపల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్ల ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. కుప్పంలోని 550కు పైగా మైనర్ ఇరిగేషన్ ట్యాంకులను లిఫ్ట్ ఇరిగేషన్, పైపులైన్లతో అనుసంధానం చేస్తామని వెల్లడించారు.
కుప్పంలో రూ.వేల కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసినట్లు సీఎం తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలో రోడ్లు, వీధి దీపాలు, అండర్‌గ్రౌండ్ యుటిలిటీ, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల అభివృద్ధి వంటి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. రైతు బజార్, ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్, సోలార్ ప్రాజెక్టులు వంటి కార్యక్రమాలను కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు.
రైతులు తక్కువ నీటితో సాగు చేసే పద్ధతులను అనుసరించాలని, ప్రకృతి సేద్యం, మైక్రో ఇరిగేషన్ ద్వారా ఆదాయం పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. కుప్పంలో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని, యువతకు నైపుణ్య శిక్షణ అందించి స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలకు డిజిటల్ లిటరసీ, పారిశ్రామిక శిక్షణ అందిస్తున్నట్లు చెప్పారు.
కుప్పం నుంచే అభివృద్ధికి శ్రీకారం: సీఎం చంద్రబాబు.. రూ.వేల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు
7
Published: 📅
Reported by: 🖊
Banu Prakash