తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలను రాజకీయ కారణాలతో బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీపై ఉన్న రాజకీయ వ్యతిరేకతను తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు అడ్డంకిగా మార్చవద్దని ప్రతిపక్ష నేతలకు సూచించారు.
నవంబర్ 13న హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, రీజనల్ రింగ్ రోడ్డు, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు, భారత్ సమ్మిట్ వంటి కార్యక్రమాలను బీజేపీ, బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్నాయని ఆరోపించారు.
తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా పరిచయం చేయడానికే భారత్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని వివరించారు. డిసెంబరులో జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు ఇది సన్నాహక కార్యక్రమమని తెలిపారు.
సదస్సుకు సుమారు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నారని పేర్కొన్నారు. అయితే కొందరు విదేశీ ప్రతినిధులకు తొలుత వీసాలు మంజూరు చేసి, అనంతరం రద్దు చేశారని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపించారు.
రాహుల్ గాంధీ సదస్సులో పాల్గొనడాన్ని బీజేపీ నేతలు వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రధాని మోదీ విదేశాల్లో సదస్సులు నిర్వహిస్తే సమర్థించే నాయకులు, రాహుల్ పర్యటనను ఎందుకు తప్పుబడుతున్నారని ప్రశ్నించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే రాజకీయాలు మానుకోవాలని కోరారు.
సదస్సు ఖర్చులపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ చేసిన విమర్శలనూ రేవంత్ రెడ్డి తోసిపుచ్చారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు.
మరోవైపు గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక పాలసీ రూపొందించినట్లు వెల్లడించారు. నవంబర్ 14న హైదరాబాద్‌కు వచ్చే రాహుల్ గాంధీ ఆ పాలసీని గిగ్ వర్కర్లకు అంకితం చేయనున్నారని చెప్పారు.
భారత్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో రాహుల్ సందేశం ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముగింపు దశకు చేరుకుందని, కీలక విషయాలు బయటపడనున్నాయని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీపై కక్షతో తెలంగాణకు అన్యాయం.. బీజేపీ, బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు!
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan