బంగ్లాదేశ్‌లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి హింసాత్మకంగా మారాయి. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, మాజీ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి మహమ్మద్ యూనస్ కుటుంబానికి చెందిన పూర్వీకుల ఇంటికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఆయన స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలపైనా దాడులు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.
చట్టోగ్రామ్ నగరంలోని పంచలైష్ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి ఈ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు యూనస్ కుటుంబానికి చెందిన ఇంటికి నిప్పుపెట్టినట్లు కథనం పేర్కొంది.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో పెద్దగా ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపినట్లు సమాచారం.
దాడికి పాల్పడిన వ్యక్తులను గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ముందు జాగ్రత్తగా ఇంటి వద్ద భద్రతను పెంచారు.
మరోవైపు మహమ్మద్ యూనస్ స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్ శాఖలను కూడా దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లు కథనం వెల్లడించింది.
నవంబర్ 10 నుంచి కనీసం 37 గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలపై దాడులు జరిగినట్లు సమాచారం. పలు ప్రాంతాల్లో బ్యాంక్ శాఖలకు నిప్పంటించడం, ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు నమోదయ్యాయి.
మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ దేశవ్యాప్త లాక్‌డౌన్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి.
గతేడాది ప్రత్యేక ట్రిబ్యునల్ షేక్ హసీనాకు మరణశిక్ష విధించిన తీర్పునకు ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అవామీ లీగ్ నిరసన కార్యక్రమాలను ప్రకటించినట్లు కథనం పేర్కొంది.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా రాజధాని ఢాకాలో పోలీసులు విస్తృతంగా చర్యలు చేపట్టారు.
ఢాకాలో 24 గంటల వ్యవధిలో 565 మందిని అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టయిన వారిలో మాజీ విద్యాశాఖ మంత్రి నూరుల్ ఇస్లాం నహిద్ కూడా ఉన్నట్లు కథనం వెల్లడించింది.
రాజకీయ నిరసనల నేపథ్యంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.
బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస.. మహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి నిప్పు, 37 గ్రామీణ్ బ్యాంక్ కార్యాలయాలపై దాడులు!
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk