హైదరాబాద్‌లో ఆన్లైన్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాలు వస్తాయని నమ్మించిన సైబర్ నేరగాళ్లు బాచుపల్లికి చెందిన 81 ఏళ్ల రిటైర్డ్ ప్రొఫెసర్ నుంచి ఏకంగా రూ.50 లక్షలు కాజేశారు. నకిలీ ట్రేడింగ్ యాప్, వాట్సాప్ గ్రూపుల ద్వారా బాధితుడిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. 2026 సెప్టెంబర్‌లో అనన్య దాస్ అనే మహిళ బాధితుడిని 'టీ14 బ్లెస్సింగ్ గాడెస్ లక్ష్మీ' పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో చేర్చింది. అప్‌స్టాక్స్ సెక్యూరిటీస్ వీఐపీ గ్రూప్ పేరుతో ట్రేడింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పరిచయం చేసుకుంది.
అనంతరం రవికుమార్ అనే వ్యక్తి గ్రూప్ అనలిస్ట్‌గా వ్యవహరిస్తూ బాధితుడికి పెట్టుబడులపై సూచనలు ఇచ్చాడు. బ్లాక్ ట్రేడింగ్, అప్పర్ సర్క్యూట్ షేర్లు, ఐపీఓ అలాట్మెంట్ల ద్వారా భారీ లాభాలు పొందవచ్చని నమ్మించాడు.
ఈ క్రమంలో బాధితుడితో నకిలీ ట్రేడింగ్ యాప్‌లో ఖాతా తెరిపించారు. సెప్టెంబర్ 24న తొలుత రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టించారు. గ్రూపులోని ఇతర సభ్యులు భారీ లాభాలు సంపాదిస్తున్నట్లు చూపించి బాధితుడిలో నమ్మకాన్ని పెంచారు.
దీంతో రిటైర్డ్ ప్రొఫెసర్ పలు విడతల్లో మొత్తం రూ.50 లక్షలను నేరగాళ్లు సూచించిన బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలకు బదిలీ చేశారు. అనంతరం యాప్‌లో పెట్టుబడిపై రూ.32 లక్షల లాభం వచ్చినట్లు చూపించారు.
అయితే బాధితుడు తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా నగదు అందలేదు. లాభాలతో కూడిన మొత్తాన్ని విడుదల చేయాలంటే అదనంగా రూ.10 లక్షలు చెల్లించాలని నేరగాళ్లు డిమాండ్ చేశారు.
ఇలాంటి మోసాల నుంచి తప్పించుకోవాలంటే గుర్తుతెలియని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పెట్టుబడి సూచనలను నమ్మకూడదు. ట్రేడింగ్ యాప్‌ల ప్రామాణికతను ధ్రువీకరించుకోవాలి. అధిక లాభాలు హామీ ఇచ్చే పథకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.
సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయడం లేదా అధికారిక సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయడం ద్వారా సహాయం పొందవచ్చు.
ట్రేడింగ్ పేరుతో భారీ సైబర్ మోసం.. రిటైర్డ్ ప్రొఫెసర్‌కు రూ.50 లక్షల షాక్.. నకిలీ యాప్‌తో వల!
10