రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పామెన గేటు సమీపంలోని బ్రిడ్జి వద్ద ఓ కారు అదుపుతప్పి అవతలి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఒకరు స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు సమాచారం.
పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం, ప్రమాదానికి గురైన వారిని షాబాద్ మండలం పొత్గల్ గ్రామానికి చెందిన రాజ్‌కుమార్ గౌడ్, మురళి గౌడ్, ఒగ్గు వెంకటయ్య, కార్ల శివకుమార్‌గా గుర్తించారు. తీవ్ర గాయాల కారణంగా రాజ్‌కుమార్ గౌడ్ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు, వాహనదారులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి ఆధారాలు సేకరించారు.
కారు అతివేగంతో ప్రయాణించడం ఒక కారణమై ఉండవచ్చని భావిస్తున్నప్పటికీ, వర్షపు నీరు వెళ్లేందుకు నిర్మించిన చిన్న బ్రిడ్జి వద్ద రోడ్డు కుంగిపోవడం కూడా ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఇదే ప్రాంతంలో గతంలోనూ ప్రమాదం జరిగినట్లు చెబుతూ, రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని కోరారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా పడి ఒకరు మృతి, ఇద్దరి పరిస్థితి విషమం
18