ఆంధ్రప్రదేశ్లో కొత్త పాఠశాలలు ఏర్పాటు చేయాలనుకునే విద్యాసంస్థల నిర్వాహకులకు ప్రభుత్వం కీలక నిర్ణయంతో ఊరట కల్పించింది. నూతన స్కూళ్ల ఏర్పాటుకు ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని కఠిన నిబంధనలను సడలిస్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసంస్థల అనుమతుల ప్రక్రియను సరళీకరించేందుకు ఏపీ విద్యా సంస్థల నిబంధనల్లో పలు సవరణలు చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం ప్రీప్రైమరీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఏర్పాటుకు జిల్లా విద్యాశాఖ అధికారులు అనుమతులు మంజూరు చేస్తారు. సెకండరీ పాఠశాలలకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు అనుమతులు ఇవ్వనున్నారు.
పాఠశాలల ఏర్పాటులో అవసరమైన కొన్ని ధ్రువీకరణ పత్రాల విషయంలో ప్రభుత్వం సడలింపులు కల్పించింది. పారిశుధ్య ధ్రువీకరణ పత్రానికి బదులుగా నిర్వాహకులు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించవచ్చు. అలాగే ట్రాఫిక్, మున్సిపల్ లేదా గ్రామ పంచాయతీల నుంచి పొందాల్సిన నిరభ్యంతర పత్రాల స్థానంలోనూ స్వీయ ధ్రువీకరణ పత్రాలు అందించేందుకు అవకాశం కల్పించింది.
అయితే భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి మినహాయింపు ఇవ్వలేదు. పాఠశాల భవనాలకు సంబంధించిన నిర్మాణ స్వరూప పత్రం, ఆక్యుపెన్సీ ధ్రువీకరణ పత్రం, అగ్నిమాపక భద్రతా ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
స్వీయ ధ్రువీకరణ పేరుతో తప్పుడు సమాచారం లేదా నకిలీ పత్రాలు సమర్పిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారికి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
కొత్త పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన దరఖాస్తులను విద్యా సంవత్సరంలో అక్టోబర్ 31 వరకు సమర్పించవచ్చు. ఆ గడువు దాటిన తర్వాత రూ.50 వేల జరిమానాతో డిసెంబర్ 31 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కొత్త విద్యాసంస్థల ఏర్పాటుకు ఉపయోగపడనుంది. అయితే నిబంధనలు సరళీకరించినప్పటికీ విద్యార్థుల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఏపీలో కొత్త స్కూళ్ల ఏర్పాటుకు గుడ్న్యూస్.. నిబంధనలు సడలించిన ప్రభుత్వం, స్వీయ ధ్రువీకరణతోనే అనుమతులు!
7
Published: 📅
Reported by: 🖊
Kanakadri