దేశవ్యాప్తంగా నీట్ పీజీ, నీట్ సూపర్ స్పెషాలిటీ కోర్సుల ప్రవేశ విధానంలో కీలక మార్పులు రానున్నాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న పర్సంటైల్ ఆధారిత అర్హత విధానానికి బదులుగా ర్యాంకుల ఆధారంగా మెరిట్ ప్రాతిపదికన సీట్లు కేటాయించాలని నిపుణుల కమిటీ ప్రతిపాదించింది. ఈ కొత్త విధానాన్ని 2027 నుంచి అమలు చేయాలని సూచించింది.
నీట్ పీజీ ప్రవేశాల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించేందుకు ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల కమిటీ నవంబర్ 3న సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈ ప్రతిపాదనకు నేషనల్ మెడికల్ కమిషన్ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. అయితే పూర్తిస్థాయి మార్గదర్శకాలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది.
పీజీ మెడికల్ సీట్లు ఖాళీగా మిగిలిపోతున్నాయనే కారణంతో కనీస అర్హత ప్రమాణాలను భారీగా తగ్గించడం సరికాదని కమిటీ అభిప్రాయపడింది. వైద్య విద్యలో నాణ్యతను కాపాడేందుకు మెరిట్ ఆధారిత ప్రవేశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది.
గతంలో ఖాళీ సీట్ల భర్తీ కోసం నీట్ పీజీ అర్హత కటాఫ్‌ను పలుమార్లు తగ్గించారు. 2023లో అన్ని కేటగిరీల అభ్యర్థులకు అర్హత పర్సంటైల్‌ను సున్నాకు తగ్గించారు. 2024లో జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 15 పర్సంటైల్, రిజర్వ్డ్ కేటగిరీలకు 10 పర్సంటైల్‌గా నిర్ణయించారు.
2026 జనవరి 13న కూడా మూడో విడత కౌన్సెలింగ్ కోసం కటాఫ్‌ను భారీగా తగ్గించారు. జనరల్ అభ్యర్థులకు 50 నుంచి 7 పర్సంటైల్‌కు, జనరల్ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 45 నుంచి 5 పర్సంటైల్‌కు తగ్గించారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు 40 నుంచి సున్నా పర్సంటైల్‌కు కుదించారు.
ఈ నిర్ణయంతో అదనంగా 95,913 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు అర్హత సాధించినట్లు సుప్రీంకోర్టుకు సమర్పించిన గణాంకాలు వెల్లడించాయి. అర్హత ప్రమాణాలను తగ్గించడం వల్ల వైద్య విద్య నాణ్యత దెబ్బతింటుందని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు నాన్ క్లినికల్ పీజీ కోర్సుల ఫీజులను తగ్గించాలని, ప్రీ క్లినికల్, పారాక్లినికల్ కోర్సులు ఎంచుకునే వారికి సర్వీస్ బాండ్ల నుంచి మినహాయింపు ఇవ్వాలని కమిటీ సూచించింది.
నీట్ పీజీ ప్రవేశాల్లో భారీ మార్పులు.. ఇక పర్సంటైల్ కాదు ర్యాంకుల ఆధారంగానే సీట్లు! 2027 నుంచి కొత్త విధానం?
10
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk