హైదరాబాద్లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు పాఠశాల విద్యార్థులు అదృశ్యమైన ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. సాయిరాం నగర్లో నివసిస్తున్న మొగిలి రవి, శిరీష దంపతుల కుమారులు వరుణ్ తేజ్, మహేష్ కనిపించకుండా పోయారు. చిన్నారుల ఆచూకీ కోసం పోలీసులు నాలుగు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు.
వరుణ్ తేజ్ నాగోల్ ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతుండగా, అతడి తమ్ముడు మహేష్ రెండో తరగతి చదువుతున్నాడు. శనివారం ఉదయం ఇద్దరు పిల్లలు పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడంతో తల్లి మందలించినట్లు సమాచారం.
అనంతరం పిల్లలను స్కూల్కు పంపించేందుకు ఆటోలో కూర్చోబెట్టి, ఇంట్లో ఉన్న పుస్తకాల బ్యాగులు తీసుకురావడానికి తల్లి లోపలికి వెళ్లింది. ఆమె తిరిగి వచ్చేసరికి ఇద్దరు బాలురు కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు.
చివరకు నాగోల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారులు ఎటువైపు వెళ్లారనే విషయాన్ని తెలుసుకునేందుకు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు.
ఈ క్రమంలో ఓ కిరాణా దుకాణంలో ఇద్దరు బాలురు చాక్లెట్లు కొనుగోలు చేసినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించినట్లు సమాచారం. అక్కడి నుంచి ఉప్పల్ వైపు వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఇద్దరు చిన్నారులు రోడ్డు దాటుతున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. అనంతరం వారు ఉప్పల్ నుంచి ఘట్కేసర్ వైపు వెళ్లినట్లు ప్రాథమిక సమాచారం అందింది.
ఈ నేపథ్యంలో ఎల్బీనగర్ ఏసీపీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు వివిధ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తూ చిన్నారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలిస్తున్నాయి.
ఇద్దరు చిన్నారులు అదృశ్యమై రోజులు గడుస్తున్నా ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ పిల్లలు క్షేమంగా తిరిగి రావాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.
హైదరాబాద్లో ఇద్దరు విద్యార్థుల అదృశ్యం.. సీసీ కెమెరాల్లో కీలక ఆధారాలు, 4 పోలీసు బృందాలతో ముమ్మర గాలింపు!
8