పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత వాణిజ్య నౌకలకు ఇరాన్ కీలక అనుమతి ఇచ్చింది. ప్రపంచ సముద్ర వాణిజ్యంలో అత్యంత ప్రాధాన్యం కలిగిన హోర్ముజ్ జలసంధి గుండా భారత నౌకలు ప్రయాణించేందుకు ప్రత్యేక మినహాయింపు ప్రకటించింది. భారత్తో పాటు చైనా, ఇరాక్, ఖతార్ దేశాల వాణిజ్య నౌకలకు కూడా ఈ వెసులుబాటు కల్పించింది.
ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశీ విధాన కమిటీ వైస్ చైర్మన్ అమిర్ హయత్ మొఘద్దమ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం ఈ నాలుగు దేశాల నౌకలపై హోర్ముజ్ జలసంధిలో ఎలాంటి రవాణా ఆంక్షలు లేవని తెలిపారు. ఆయా దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చని, అమెరికా కూడా వాటిని అడ్డుకోవడం లేదని పేర్కొన్నారు.
అయితే ఈ ప్రత్యేక అనుమతుల వెనుక ఆయా దేశాలతో ఉన్న పరస్పర ప్రయోజనాలు కీలకంగా ఉన్నట్లు ఆయన వివరించారు. భారత్ నుంచి ఔషధాలను దిగుమతి చేసుకునేందుకు భారత వాణిజ్య నౌకలకు అనుమతి కల్పించినట్లు తెలిపారు.
మరోవైపు చైనా నుంచి రాజకీయ మద్దతు పొందాలనే ఉద్దేశంతో ఆ దేశ నౌకలకు రవాణా మినహాయింపులు ఇచ్చినట్లు వెల్లడించారు. ఇరాక్, ఖతార్ దేశాల నౌకలకు కూడా ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించినట్లు ప్రకటించారు.
అయితే భారత, చైనా నౌకల నుంచి ఇరాన్ రవాణా రుసుములు వసూలు చేస్తున్నట్లు మొఘద్దమ్ పేర్కొన్నారు. ఖతార్ నౌకలకు మాత్రం ఎలాంటి రుసుము లేకుండా ప్రయాణానికి అనుమతి ఇచ్చినట్లు తెలిపారు. ఇరాక్ నౌకలకు రుసుములు వర్తిస్తాయా లేదా అనే విషయంపై స్పష్టత ఇవ్వలేదు.
హోర్ముజ్ జలసంధి ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాకు అత్యంత కీలకమైన మార్గం. పర్షియన్ గల్ఫ్ నుంచి అంతర్జాతీయ మార్కెట్లకు ఇంధన సరఫరా ఈ జలమార్గం ద్వారానే జరుగుతుంది.
అయితే ప్రయాణ అనుమతులు లభించినప్పటికీ ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, రవాణా రుసుములు వాణిజ్య కార్యకలాపాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది
హోర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు గ్రీన్ సిగ్నల్.. ప్రత్యేక అనుమతి ఇచ్చిన ఇరాన్, రవాణా రుసుం తప్పనిసరి!
6
Published: 📅
Reported by: 🖊
Sarika Sk