తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల పథకం కింద సొంతింటి కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. పైలట్ ప్రాజెక్టులో భాగంగా వెయిటింగ్ లిస్టులో ఉన్న 1,741 మందికి ఈ-లాటరీ ద్వారా ఇళ్లను కేటాయించింది. నవంబర్ 4న హైదరాబాద్ నాంపల్లిలోని హౌసింగ్ బోర్డు ప్రధాన కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహించారు.
క్యూర్ ప్రాంతాల్లోని అల్పాదాయ వర్గాల ప్రజలకు సొంతింటి సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల టవర్ల పథకాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో 480 ఇళ్లను నిర్మిస్తోంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి లాటరీ విధానంలో ఇళ్లను కేటాయిస్తోంది.
అయితే గతంలో ఎంపికైన కొందరు క్షేత్రస్థాయి పరిశీలనలో అనర్హులుగా తేలారు. మరికొందరు తమ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇళ్ల కేటాయింపును రద్దు చేసుకున్నారు. దీంతో మొత్తం 14 నియోజకవర్గాల్లో 1,741 ఇళ్లు ఖాళీగా మారాయి.
ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం మాప్-అప్ ఈ-లాటరీ నిర్వహించింది. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్న అర్హులైన లబ్ధిదారులకు ఈ ఇళ్లను కేటాయించింది.
నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే ఖైరతాబాద్‌లో అత్యధికంగా 327 మందికి ఇళ్లు దక్కాయి. మహేశ్వరంలో 201 మంది, మలక్‌పేటలో 171 మంది, మల్కాజిగిరిలో 150 మంది, మేడ్చల్‌లో 143 మంది లబ్ధిదారులు ఎంపికయ్యారు.
అలాగే రాజేంద్రనగర్‌లో 133 మంది, నాంపల్లిలో 106 మంది, బహదూర్‌పురాలో 91 మంది, సనత్‌నగర్‌లో 88 మంది, కుత్బుల్లాపూర్‌లో 80 మందికి ఇళ్లు కేటాయించారు.
కార్వాన్లో 73 మంది, కంటోన్మెంట్లో 66 మంది, కూకట్‌పల్లిలో 59 మంది, అంబర్‌పేటలో 53 మంది లబ్ధిదారులు ఇళ్లను పొందారు.
మరోవైపు భవిష్యత్తులో ఖాళీలు ఏర్పడితే కేటాయింపులు చేసేందుకు అదనంగా 875 మందిని ఈ-లాటరీ ద్వారా వెయిటింగ్ లిస్టుకు ఎంపిక చేశారు. వీరికి ప్రస్తుతం ఇళ్ల కేటాయింపు జరగలేదని గుర్తించాలి.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అల్పాదాయ వర్గాల కుటుంబాలకు సొంతింటి కలను నెరవేర్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఈ-లాటరీలో 1,741 మందికి ఇళ్ల కేటాయింపు, మరో 875 మంది వెయిటింగ్ లిస్టులో!
12