దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా కాల్చే సమయాలపై హైదరాబాద్ పోలీసులు కీలక హెచ్చరికలు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం పండుగ రోజు రాత్రి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చాలని మల్కాజిగిరి జోన్ డీసీపీ చిత్తలూరి శ్రీధర్‌గౌడ్ స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దీపావళి వేడుకల్లో ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు డీసీపీ తెలిపారు. రాత్రి 10 గంటల తర్వాత ఎవరైనా బాణసంచా కాలిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు. ప్రజలు నిబంధనలను పాటిస్తూ పండుగను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు.
మరోవైపు బాణసంచా వ్యాపారులకు కూడా పోలీసులు పలు మార్గదర్శకాలు జారీ చేశారు. మల్కాజిగిరి జోన్ పరిధిలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునేవారు ముందుగా డీసీపీ కార్యాలయం, అగ్నిమాపక శాఖ, పేలుడు పదార్థాల నియంత్రణ విభాగాల నుంచి అవసరమైన అనుమతులు పొందాలని తెలిపారు.
అనుమతులు లేకుండా బాణసంచా విక్రయించే దుకాణాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. వ్యాపారులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించారు.
నిబంధనల ప్రకారం బాణసంచా దుకాణాల మధ్య కనీసం మూడు అడుగుల దూరం ఉండాలి. దుకాణాలను ఒకదానికొకటి ఎదురెదురుగా ఏర్పాటు చేయకూడదు. అగ్ని ప్రమాదాలను నివారించేందుకు ఇసుక బస్తాలు, నీటి డ్రమ్ములు, మంటలను ఆర్పే పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలి.
అలాగే ప్రతి బాణసంచా దుకాణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని పోలీసులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించేందుకు డయల్ 112, అగ్నిమాపక సేవల నంబర్ 101, అంబులెన్స్ సేవల నంబర్ 108ను స్పష్టంగా ప్రదర్శించాలి.
ముఖ్యంగా 18 ఏళ్లలోపు బాలబాలికలు ఒంటరిగా బాణసంచా కొనుగోలు చేయడానికి వస్తే వారికి టపాసులు విక్రయించకూడదని డీసీపీ స్పష్టం చేశారు.
దీపావళి సమయంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా వ్యాపారులు, వినియోగదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పండుగ ఆనందాన్ని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా జరుపుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. రాత్రి 10 గంటల సమయ పరిమితిని ప్రతి ఒక్కరూ పాటించాలని డీసీపీ శ్రీధర్‌గౌడ్ హెచ్చరించారు.
దీపావళి వేళ పోలీసుల కీలక హెచ్చరిక.. రాత్రి 10 దాటితే టపాసులు కాల్చొద్దు, నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు!
6
Published: 📅
Reported by: 🖊
Kanakadri