ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన రాప్తాడు రంపం దాడి ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడు హేమంత్పై పోలీసులు పలు కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పాఠశాలలోకి చొరబడి విద్యార్థినిపై పదునైన రంపంతో దాడి చేసిన ఘటనను పోలీసులు తీవ్రంగా పరిగణించారు. బాధితులను రక్షించే ప్రయత్నంలో గాయపడిన విద్యార్థి ఫిర్యాదు ఆధారంగా అదనపు సెక్షన్లను చేర్చినట్లు వెల్లడించారు.
నిందితుడు హేమంత్పై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 109(1) కింద హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అలాగే రంపంతో బాలిక ముఖం, వీపు భాగాలపై దాడి చేసి గాయపరిచినందుకు సెక్షన్ 118(1) కింద మరో కేసు నమోదు చేశారు. పాఠశాలలోకి అక్రమంగా ప్రవేశించి పదునైన ఆయుధంతో దాడికి పాల్పడినందుకు BNS సెక్షన్ 333ను కూడా చేర్చారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని గోపిక ఫిర్యాదు ఆధారంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టంలోని సెక్షన్ 3(2)(v) కింద కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సెక్షన్ల నేపథ్యంలో నిందితుడు హేమంత్‌కు జీవిత ఖైదు పడే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే శిక్షపై తుది నిర్ణయం న్యాయస్థానం తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది.
మరోవైపు రంపం దాడిలో తీవ్రంగా గాయపడిన గోపిక ప్రస్తుతం బెంగళూరులోని మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నట్లు సమాచారం. వైద్యుల పర్యవేక్షణలో ఆమెకు చికిత్స కొనసాగుతోంది.
ఇదిలా ఉండగా, పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిందితుడు హేమంత్ కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి కాలికి తీవ్రమైన గాయం కావడంతో కాలు తొలగించాల్సిన అవసరం రావొచ్చని వైద్యులు వెల్లడించినట్లు సమాచారం. అయితే దీనిపై తుది వైద్య నిర్ణయం ఇంకా వెలువడలేదు.
రాప్తాడు రంపం దాడి కేసులో కీలక పరిణామం.. హేమంత్పై కఠిన సెక్షన్లతో కేసులు, జీవిత ఖైదు పడే అవకాశం!
16
Published: 📅
Reported by: 🖊
Kanakadri