ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం, ప్రస్తుత పరిస్థితులు, సహాయక చర్యలపై సమీక్షించారు. ఎక్కడా ప్రాణనష్టం జరగకుండా చూడడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని స్పష్టం చేశారు.
ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో వర్షపాతం మరింత పెరిగిందని, వచ్చే నాలుగు నుంచి ఐదు గంటలు అత్యంత కీలకమని సీఎం తెలిపారు. బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో వర్షాలు కొనసాగుతాయని వెల్లడించారు. రాష్ట్రంలోని 21 పట్టణ ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదవుతోందన్నారు. ప్రజలు సాయంత్రం వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు.
తుఫాన్ తీవ్రత రాత్రికి పూర్తిగా తగ్గే అవకాశం ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. తాగునీరు, విద్యుత్ సరఫరా, రహదారుల అనుసంధాన వ్యవస్థ పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. చివరి బాధితుడికి కూడా సహాయం అందే వరకు ప్రభుత్వ యంత్రాంగం విశ్రమించకూడదని స్పష్టం చేశారు.
ప్రకాశం, బాపట్ల జిల్లాల్లో విద్యుత్ సరఫరాకు ఏర్పడిన అంతరాయాలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని సూచించారు. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు క్షేత్రస్థాయిలో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. చెరువులు, రిజర్వాయర్లు, వాగులు ప్రమాదకర స్థాయిలో లేకపోయినా అప్రమత్తంగా ఉండాలన్నారు.
సమీక్షలో పాల్గొన్న అధికారులు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన సహాయక చర్యలను సీఎంకు వివరించారు. ఒంగోలులో కూలిపోయిన చెట్లను తొలగించినట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో పంట పొలాల్లో నీరు నిల్వకుండా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
పల్నాడు, మార్కాపురం, గుంటూరు జిల్లాల్లో పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని వివరించారు.
వర్షపు నీటిని సమర్థంగా నిర్వహించాలని, పునరుద్ధరణ పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. తుఫాన్ సమయంలో కష్టపడి పనిచేస్తున్న అధికారులు,సిబ్బందిని అభినందించారు. ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
మురసు తుఫాన్‌పై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష.. ప్రాణనష్టం జరగొద్దు, వచ్చే 5 గంటలు అత్యంత కీలకం!
10
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati