ఆంధ్రప్రదేశ్‌లో మురసు తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పలు జిల్లాల్లో రహదారులు జలమయం కాగా, భారీ వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. తుపాను కారణంగా రవాణా వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా నరసాపురం-సఖినేటిపల్లి రేవుల మధ్య రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రజల భద్రత దృష్ట్యా పేరుపాలెం బీచ్‌ను కూడా మూసివేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో తుపాను ప్రభావం అధికంగా ఉంది. కొత్తపట్నం, పాకాల, ఉలవపాడు, చీరాల, వేటపాలెం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల భారీ చెట్లు విరిగిపడగా, విద్యుత్ స్తంభాలు రోడ్లపై నేలకొరిగాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఏలూరులో తెల్లవారుజాము నుంచి కుండపోత వర్షం కురుస్తోంది. భారీ వర్షాల కారణంగా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. తుపాను ప్రభావం తగ్గే వరకు కొన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.
విజయవాడలో అర్ధరాత్రి నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వర్షాల కారణంగా ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ కేంద్రాలకు సకాలంలో చేరుకోలేకపోయారు. దీంతో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఆలస్యంగా ప్రారంభమవుతుందని అధికారులు తెలిపారు.
మరోవైపు నెల్లూరు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. పొదలకూరు-సంగం రహదారిపై భారీ చెట్టు కూలిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోమశిల డ్యామ్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రావడం లేదని అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో అధికారుల సూచనలు పాటిస్తూ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఏపీని వణికిస్తున్న మురసు తుపాను.. పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు, రైళ్లు రద్దు.. విద్యాసంస్థలకు సెలవులు!
12
Published: 📅
Reported by: 🖊
Sarika Sk