ఐపీఎల్ 2027 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల ట్రేడింగ్ వ్యవహారం ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే ముంబై ఇండియన్స్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య ట్రేడ్‌పై చర్చ జరుగుతుండగా, తాజాగా ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ పేరు తెరపైకి వచ్చింది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు చెందిన లివింగ్‌స్టోన్‌ను ట్రేడ్ ద్వారా సొంతం చేసుకునేందుకు చెన్నై సూపర్ కింగ్స్ ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. విదేశీ ఆల్‌రౌండర్ కోసం అన్వేషిస్తున్న సీఎస్కే యాజమాన్యం లివింగ్‌స్టోన్‌ను ఓ ఎంపికగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు జరిగిన వేలంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను ఏకంగా రూ.13 కోట్లకు కొనుగోలు చేసింది. భారీ ధర పలికిన ఈ ఇంగ్లండ్ ఆటగాడిపై ఎస్ఆర్హెచ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే ఆ సీజన్లో అతడు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.
2026 ఐపీఎల్లో లివింగ్‌స్టోన్ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ రెండు మ్యాచ్‌ల్లో కలిపి 15 పరుగులు చేశాడు. పేలవ బ్యాటింగ్ ప్రదర్శన కారణంగా మిగిలిన సీజన్లో తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. కనీసం ఇంపాక్ట్ ప్లేయర్‌గా కూడా అవకాశం లభించలేదు.
ఈ నేపథ్యంలో వచ్చే సీజన్‌కు ముందు లివింగ్‌స్టోన్‌ను జట్టు నుంచి వదులుకునేందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే అవకాశాన్ని ఉపయోగించుకుని అతడిని తమ జట్టులోకి తీసుకోవాలని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తున్నట్లు సమాచారం.
లివింగ్‌స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు స్పిన్ బౌలింగ్ చేయగల సామర్థ్యం ఉన్న ఆటగాడు. అవసరమైనప్పుడు భారీ షాట్లతో పరుగులు సాధించగలడు. దీంతో అతడి ఆల్‌రౌండ్ నైపుణ్యాలు సీఎస్కేకు ఉపయోగపడే అవకాశముంది.
ఒకవేళ రెండు ఫ్రాంచైజీల మధ్య ఒప్పందం కుదిరితే ఐపీఎల్ 2027కు ముందు జరిగే ఆసక్తికర ట్రేడ్లలో ఇది ఒకటిగా నిలిచే అవకాశముంది. లివింగ్‌స్టోన్ భవిష్యత్తుపై స్పష్టత కోసం క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.
ఐపీఎల్ 2027లో భారీ ట్రేడ్‌కు రంగం సిద్ధం?.. రూ.13 కోట్ల స్టార్ ఆల్‌రౌండర్‌పై సీఎస్కే కన్ను!
9