అనకాపల్లి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పులపర్తి గ్రామానికి చెందిన భార్యాభర్తలు పాపారావు, అమ్మాజీ సైకిల్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం వారిని ఢీకొట్టింది. ప్రమాదం తీవ్రంగా ఉండటంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.
ప్రమాదాన్ని గమనించిన వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిస్థితిని పరిశీలించిన అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో పులపర్తి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
స్థానికుల వివరాల ప్రకారం.. పాపారావు, అమ్మాజీ తెల్లవారుజామున పాలు తీసుకునేందుకు పొలం వద్దకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే వారిని ఢీకొట్టిన వాహనం వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వాహనం కదలికలను గుర్తించి నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
8
Published: 📅
Reported by: 🖊
Sarika Sk