ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్‌లో సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 119 పోస్టులను ఈ నియామక ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి లా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు, నోటిఫికేషన్‌లో పేర్కొన్న సర్వీస్ అర్హతలను కలిగి ఉంటే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
2026 సెప్టెంబర్ 1 నాటికి అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, మాజీ సైనిక ఉద్యోగులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.77,840 నుంచి రూ.1,36,520 వరకు వేతనం అందుతుంది.
ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదట 100 మార్కులకు కంప్యూటర్ ఆధారిత స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. ఇందులో కనీసం 40 శాతం మార్కులు సాధించిన వారిని 1:10 నిష్పత్తిలో రాత పరీక్షకు ఎంపిక చేస్తారు. రాత పరీక్షలో సివిల్ లాస్, క్రిమినల్ లాస్, ఇంగ్లీష్‌కు సంబంధించిన మూడు పేపర్లు ఉంటాయి. ఇంగ్లీష్ పేపర్‌లో అనువాదం, వ్యాస రచన ఉంటాయి.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో 50 మార్కుల ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1,500 కాగా, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.750. దరఖాస్తులకు 2026 అక్టోబర్ 26 చివరి తేదీ.
ఏపీ హైకోర్టులో 119 సివిల్ జడ్జి పోస్టులు.. నెలకు రూ.1.36 లక్షల వరకు జీతం
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk