హైదరాబాద్‌లో సైబర్ నేరగాళ్లు 72 ఏళ్ల వృద్ధుడిని భయపెట్టి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు. షేట్‌బషీర్‌బాద్‌కు చెందిన వృద్ధుడికి కొంతమంది సైబర్ నేరగాళ్లు ముంబై పోలీసులమంటూ ఫోన్ చేశారు. ఆయన రూ.2 కోట్లను ఉగ్రవాద సంస్థలకు నిధులుగా సమకూర్చారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
అంతటితో ఆగకుండా వీడియో కాల్ చేసి ఓ వ్యక్తిని సీనియర్ పోలీస్ అధికారిగా పరిచయం చేశారు. కేసు నుంచి తప్పించుకోవాలంటే తాము చెప్పిన విధంగా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తెచ్చారు. ఈ విషయం కుటుంబసభ్యులకు లేదా ఇతరులకు చెబితే వారిని కూడా కేసులో ఇరికిస్తామని బెదిరించారు. దీంతో వృద్ధుడు తీవ్ర భయాందోళనకు గురయ్యాడు.
సైబర్ నేరగాళ్ల మాటలను నమ్మిన బాధితుడు కేసు నుంచి బయటపడేందుకు డబ్బులు చెల్లించేందుకు అంగీకరించాడు. దీంతో నిందితులు విడతల వారీగా అతడి నుంచి డబ్బులు వసూలు చేశారు. ఈ విధంగా దాదాపు రూ.55.20 లక్షలను కాజేశారు.
కొంతకాలం తర్వాత తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించిన బాధితుడు వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుల వివరాలను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇలాంటి ఫోన్ కాల్స్, వీడియో కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. పోలీసులు లేదా ఇతర ప్రభుత్వ అధికారులు ఫోన్ ద్వారా బెదిరించి డబ్బులు డిమాండ్ చేయరని, అనుమానాస్పద కాల్స్ వస్తే వెంటనే సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు.
ఉగ్రవాదులకు నిధులిచ్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. రూ.55.20 లక్షలు కాజేసిన సైబర్ నేరగాళ్లు
3