అంతర్జాతీయ కాఫీ దినోత్సవం సందర్భంగా అరకు కాఫీ ప్రత్యేకతను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. తూర్పు కనుమల అద్భుతమైన ప్రకృతి ఒడిలో పండే అరకు కాఫీ రాష్ట్రానికి ప్రత్యేక సంపదగా పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. అరకు కాఫీలోని ప్రతి కప్పు తూర్పు కనుమల సువాసనను, అక్కడి నేల సారవంతమైన గుణాన్ని, గిరిజన రైతుల కఠోర శ్రమను ప్రతిబింబిస్తుందని తెలిపారు.
తన దృష్టిలో అరకు కాఫీ కేవలం రుచి, సువాసనకు సంబంధించిన ఉత్పత్తి కాదని పవన్ కల్యాణ్ అన్నారు. ఇది అడవులు, గిరిజన సమాజాలు, వారి సంప్రదాయ విజ్ఞానం మధ్య ఉన్న అనుబంధానికి ప్రతీక అని పేర్కొన్నారు. అరకు లోయల నుంచి ఢిల్లీలోని పార్లమెంట్ వరకు ప్రత్యేక స్టాళ్ల ద్వారా అరకు కాఫీని ప్రదర్శించిన విషయాన్ని ప్రస్తావించారు.
స్థానిక సమాజాల మూలాల నుంచి వచ్చిన ఒక ఉత్పత్తి భారతదేశ కథను ప్రపంచానికి ఎలా చాటగలదో అరకు కాఫీ ప్రస్థానం తెలియజేస్తుందని పవన్ అన్నారు. అరకు కాఫీ సాగులో భాగస్వాములైన గిరిజన కుటుంబాల కృషిని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు.
అరకు కాఫీని సాధ్యం చేస్తున్న రైతులు, అడవులు, తూర్పు కనుమలను గౌరవించుకోవాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కొండల నుంచి ప్రపంచంలోని ప్రతి ప్రాంతానికి అరకు కాఫీని చేర్చే దిశగా కృషి చేయాలని అన్నారు. ఒక కప్పు అరకు కాఫీ అంటే నేల రుచి, ప్రజల కథ, తూర్పు కనుమల సువాసనల కలయిక అని పేర్కొంటూ అంతర్జాతీయ కాఫీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
అరకు కాఫీని గౌరవించుకోవడం గర్వకారణం: పవన్ కల్యాణ్
2
Published: 📅
Reported by: 🖊
Kanakadri