తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సన్నాహాలు వేగం పుంజుకున్నాయి. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి జీహెచ్‌ఎంసీ ఎన్నికల విభాగం కొత్తగా ఏర్పడిన మండలాల వివరాలను సేకరిస్తోంది. ముఖ్యంగా 2021 తర్వాత ఏర్పడిన కొత్త రెవెన్యూ మండలాల పరిధి, పోలింగ్ కేంద్రాల అవసరాలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
2021లో జరిగిన ఎన్నికల్లో మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో 5,31,268 మంది ఓటర్లు ఉండగా, 799 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెయ్యికి పైగా ఓటర్లు ఉన్న మండలాల్లో ఓటర్ల సంఖ్యను బట్టి అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసే విధానం ఉంది. ఈ నేపథ్యంలో కొత్త మండలాల గుర్తింపు, వాటికి అనుగుణంగా ఎన్నికల ఏర్పాట్లు చేయడం అధికారులకు కీలకంగా మారింది.
2022 సెప్టెంబరులో రాష్ట్రవ్యాప్తంగా కొత్త రెవెన్యూ మండలాలు ఏర్పడిన నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లోని వివరాలను అధికారులు సంబంధిత జిల్లా కలెక్టర్ల నుంచి సేకరిస్తున్నారు. ఇప్పటివరకు అందిన సమాచారంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కౌకుంట్ల మండలం కొత్తగా ఏర్పడినట్లు పేర్కొంటున్నారు.
మరోవైపు పట్టభద్రుల ఓటర్ల జాబితాలను తాజాగా సిద్ధం చేస్తున్నారు. మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్‌తో పాటు వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గానికి కూడా కొత్తగా ఓటర్ల జాబితా తయారు చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. నవంబర్ 1, 2026ను అర్హత తేదీగా నిర్ణయించారు. ఫారం-18 ద్వారా దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6 వరకు గడువు ఉంది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాను నవంబర్ 25న, తుది జాబితాను డిసెంబర్ 30న ప్రకటించనున్నారు.
పట్టభద్రుల ఎన్నికలు.. కొత్త మండలాల గుర్తింపు
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati