హైదరాబాద్‌లోని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కారు ప్రమాదం కేసులో కొత్త వివరాలు వెలుగులోకి వచ్చాయి. మరో రెండు రోజుల్లో ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాల్సిన యువకుడు, మద్యం మత్తులో కారు నడిపి ఏడుగురు కార్మికులను ఢీకొట్టాడన్న ఆరోపణలతో అరెస్టై చర్లపల్లి జైలుకు వెళ్లాడు.
సెప్టెంబర్ 29 అర్ధరాత్రి ఈసీఐఎల్ చౌరస్తా సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న బిహార్‌కు చెందిన ఏడుగురు కార్మికులను వేగంగా వచ్చిన కారు ఢీకొట్టింది. మౌలాలిలోని ఓ రెస్టారెంట్‌లో పని ముగించుకుని కమలానగర్‌లోని నివాసానికి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
బాధితుల ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైనట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పవన్‌కుమార్‌ను మరుసటి రోజు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో అతడు త్వరలో అమెరికా వెళ్లాల్సి ఉన్నట్లు తెలిసింది.
అందుకు ముందు కొంతమంది స్నేహితులకు పార్టీ ఇచ్చిన పవన్‌కుమార్, అనంతరం మరో స్నేహితుడితో కలిసి కారులో ఇంటికి బయలుదేరినట్లు సమాచారం. ఈ క్రమంలో మద్యం ప్రభావంలో అతివేగంగా డ్రైవింగ్ చేస్తూ కార్మికులను ఢీకొట్టినట్లు ఆరోపిస్తున్నారు. అతనికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదని బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన డ్రంక్ డ్రైవింగ్ ఎంతటి తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందో మరోసారి గుర్తుచేసింది.
అమెరికా వెళ్లాల్సిన యువకుడు.. డ్రంక్ డ్రైవ్ కేసులో చర్లపల్లి జైలుకు
0