హైదరాబాద్ మియాపూర్‌లోని ఓ లాడ్జిలో మెడికో కె. సృజన అనుమానాస్పదంగా మృతి చెందిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సృజనను రవి హత్య చేశాడని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, మియాపూర్ పోలీసులు కేసును హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం రవి పరారీలో ఉండగా అతడి కోసం ప్రత్యేకంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం సెప్టెంబర్ 29న సృజన కోసం మియాపూర్‌లోని ఓ లాడ్జిలో రవి గది బుక్ చేసినట్లు గుర్తించారు. తన వద్ద ఉన్న సృజన బంగారు గొలుసును తిరిగి ఇస్తానని చెప్పి ఆమెను హైదరాబాద్‌కు రప్పించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో హనుమకొండలో పీడియాట్రిక్స్ చదువుతున్న సృజన హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది.
సెప్టెంబర్ 30న ఆమె మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ తర్వాత రవి మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్లు కూడా గుర్తించారు. సృజన తల్లిదండ్రులకు ఆమె ఆచూకీ తెలియకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.
సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా ఆమె మియాపూర్‌లో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు లాడ్జికి వెళ్లి గది తలుపులు తెరిచారు. అక్కడ మంచంపై సృజన మృతదేహాన్ని కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అయితే మృతికి ఖచ్చితమైన కారణం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు. కేసులో కుటుంబ సభ్యుల ఆరోపణలు, లాడ్జి రికార్డులు, ఫోన్ వివరాలు కీలకంగా మారనున్నాయి.
మెడికో సృజన మృతి కేసులో ట్విస్ట్.. హత్య కేసుగా నమోదు, రవి కోసం గాలింపు
0
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati