ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎస్ఎంఈ, సెర్ప్, ఎన్నారై శాఖల మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరంలో మాట్లాడిన ఆయన, బీసీలకు 34 శాతం రిజర్వేషన్ అమలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని చెప్పారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వస్తుందని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు. బీసీలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిని మించుతున్నాయని పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధిత ఉత్తర్వులను రద్దు చేసింది. అవసరమైన డేటా సేకరణ, న్యాయపరమైన ప్రక్రియ అనంతరం ప్రభుత్వం రిజర్వేషన్ అంశాన్ని తిరిగి పరిశీలించవచ్చని కోర్టు పేర్కొంది.
హైకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో 34 శాతం బీసీ రిజర్వేషన్ సాధించేందుకు ప్రభుత్వం న్యాయపరంగా ప్రయత్నిస్తుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గతంలో అమలైన 23 శాతం రిజర్వేషన్ సరిపోదని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.
బీసీ రిజర్వేషన్లకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
0
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan