బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాను తిరిగి ఆ దేశానికి అప్పగించే అంశంపై భారత్ కీలక వ్యాఖ్యలు చేసింది. హసీనా అప్పగింతకు నిర్దిష్ట టైంఫ్రేమ్ ఇవ్వడం సాధ్యం కాదని బంగ్లాదేశ్‌లో భారత హైకమిషనర్ దినేష్ త్రివేదీ తెలిపారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం చేసిన అప్పగింత అభ్యర్థనను భారత్ ఒక వ్యవస్థీకృత చట్టపరమైన ప్రక్రియ ద్వారా పరిశీలిస్తోందని, ఇందులో న్యాయస్థానాల పాత్ర కూడా ఉన్నందున గడువు చెప్పలేమని ఆయన పేర్కొన్నారు.
ఢాకాలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన త్రివేదీ, 2024 ఆగస్టులో షేక్ హసీనా భారత్‌కు వచ్చిన పరిస్థితులను కూడా వివరించారు. ఆమెను భారత వైమానిక దళం లేదా సైన్యం భారత్‌కు తీసుకురాలేదని స్పష్టం చేశారు. హసీనా భారత్‌కు చేరుకున్న సమయంలో ఇంకా బంగ్లాదేశ్ ప్రధానమంత్రి హోదాలోనే ఉన్నారని, అప్పటి పరిస్థితుల్లో ఆమెను దేశంలోకి అనుమతించడం తప్ప భారత్‌కు పెద్దగా మరో మార్గం లేదని ఆయన పేర్కొన్నారు.
2024 ఆగస్టు 5న తీవ్ర ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో హసీనా బంగ్లాదేశ్‌ను విడిచి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉన్నారు. హసీనాను తిరిగి అప్పగించాలని ఢాకా పలుమార్లు కోరగా, ఆ అభ్యర్థనను స్థాపిత విధానాల ప్రకారం పరిశీలిస్తున్నామని భారత్ చెబుతోంది. ఈ అంశం భారత్-బంగ్లాదేశ్ సంబంధాల్లో ముఖ్యమైన చర్చనీయాంశంగా కొనసాగుతోంది.
హసీనా అప్పగింతకు టైంఫ్రేమ్ చెప్పలేం.. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతోంది: భారత్
0
Published: 📅
Reported by: 🖊
Banu Prakash