రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సహ వ్యవస్థాపకుడు ఆశుతోశ్ రాంకా బృందంపై జరిగిన దాడి రాజకీయ వివాదానికి దారితీసింది. రాంపురా కన్వర్‌పురా ప్రాంతంలో పాఠశాల పరిశీలన కోసం వెళ్లిన సీజేపీ బృందంపై కొందరు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం.
‘స్కూల్ ఠీక్ కరో’ కార్యక్రమంలో భాగంగా స్థానికుల ఆహ్వానం మేరకు తాము పాఠశాలను సందర్శించేందుకు వెళ్లామని ఆశుతోశ్ రాంకా తెలిపారు. అయితే గ్రామంలోకి ప్రవేశించే సమయంలో కొందరు వ్యక్తులు వారిని అడ్డుకుని నినాదాలు చేశారని, అనంతరం రాళ్లతో దాడి చేశారని ఆరోపించారు.
ఈ ఘటనలో కార్యకర్తల వాహనాలు, మొబైల్ ఫోన్లు ధ్వంసమయ్యాయని, పలువురు గాయపడ్డారని సీజేపీ వర్గాలు పేర్కొన్నాయి. తన చొక్కాను చింపి దాడి చేశారని, ఒక కార్యకర్త చేయి విరిగిందని రాంకా ఆరోపించారు.
ఈ దాడి వెనుక బీజేపీ కార్యకర్తలు ఉన్నారని ఆశుతోశ్ రాంకా ఆరోపించగా, గ్రామస్థులను నిందించవద్దని కోరారు. బయటి వ్యక్తులను తీసుకొచ్చి హింసకు పాల్పడ్డారని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను బీజేపీ వర్గాలు ఖండించాయి.
ఈ ఘటన రాజస్థాన్ అసెంబ్లీలోనూ చర్చకు దారితీసింది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ సింగ్ డోటసారా దాడికి బీజేపీయే కారణమని ఆరోపించగా, రాష్ట్ర హోంమంత్రి జవహర్ సింగ్ బేదం మాత్రం సీజేపీ పేరుతో కాంగ్రెస్ రాజకీయంగా ఉద్రిక్తతలు సృష్టిస్తోందని విమర్శించారు.
ప్రస్తుతం ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి అసలు కారణాలు, బాధ్యులపై చర్యలు తీసుకునే అంశం విచారణ తర్వాత స్పష్టమయ్యే అవకాశం ఉంది.
జైపూర్‌లో సీజేపీ బృందంపై దాడి.. ఆశుతోశ్ రాంకా ఆరోపణలతో రాజకీయ దుమారం
9