ఫుట్‌బాల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (FIFA) స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ ప్రధాన కార్యాలయంలో టోర్నీ వివరాలను ప్రకటించింది.
మహిళల ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా దక్షిణ అమెరికాలో జరగనున్న ఈ మెగా టోర్నీకి బ్రెజిల్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీలో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. బ్రెజిల్‌లోని ఎనిమిది ప్రధాన నగరాల్లో ప్రపంచ స్థాయి వేదికలపై పోటీలు నిర్వహించనున్నారు.
ఆతిథ్య జట్టు బ్రెజిల్ తన తొలి మ్యాచ్‌ను జూన్ 24న రియో డి జనీరోలోని ప్రఖ్యాత ఎస్టాడియో డో మరాకానా స్టేడియంలో ఆడనుంది. గ్రూప్ దశలో చివరి మ్యాచ్‌ను జూలై 4న బ్రెసిలియా నగరంలో ఆడనుంది.
నాకౌట్ దశకు సంబంధించి కూడా ఫిఫా వేదికలను ఖరారు చేసింది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్‌లు బ్రెసిలియా, పోర్టో అలెగ్రే, రెస్సిఫె, సాల్వడార్ నగరాల్లో జరగనున్నాయి. క్వార్టర్ ఫైనల్స్‌కు బెలో హోరిజోంటే, ఫోర్టలేజా, రియో డి జనీరో, సావో పాలో నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
సెమీఫైనల్ మ్యాచ్‌లలో ఒకటి సావో పాలోలో, మరో సెమీఫైనల్‌తో పాటు ఫైనల్ మ్యాచ్ రియో డి జనీరోలోని మరాకానా స్టేడియంలో జరగనుంది. జూలై 25న జరిగే తుదిపోరు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
పురుషుల, మహిళల ప్రపంచకప్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చిన మూడో స్టేడియంగా మరాకానా అరుదైన ఘనత సాధించనుంది. టోర్నీ సమయంలో బ్రెజిల్ వ్యాప్తంగా ఫిఫా ఫ్యాన్ ఫెస్టివల్స్ నిర్వహించి అభిమానులకు ఫుట్‌బాల్ వేడుకల అనుభూతిని అందించనున్నట్లు ఫిఫా వెల్లడించింది.
ఫిఫా మహిళల ప్రపంచకప్ 2027 షెడ్యూల్ విడుదల.. బ్రెజిల్‌లో 64 మ్యాచ్‌లతో ఫుట్‌బాల్ పండుగ
14
Published: 📅
Reported by: 🖊
Kanakadri