శంషాబాద్‌లో యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంను దుండగులు బద్దలు కొట్టి భారీగా నగదును అపహరించారు. సతంరాయిలోని ఏటీఎంలో జరిగిన ఈ చోరీలో రూ.32 లక్షల నగదు చోరీకి గురైంది. ఈ ఘటన శంషాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.
మంగళవారం ఉదయం స్థానికులు ఏటీఎం ధ్వంసమై ఉండటాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. దుండగులు ఏటీఎం రూమ్‌లోకి ప్రవేశించి నగదును అపహరించినట్లు గుర్తించారు. అంతేకాకుండా తమను గుర్తించకుండా ఉండేందుకు ఏటీఎం రూమ్‌తో పాటు ఎంట్రన్స్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను కూడా ధ్వంసం చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను గుర్తించేందుకు ఏటీఎం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. చోరీకి ముందు, తర్వాత అక్కడి పరిసరాల్లో అనుమానాస్పదంగా సంచరించిన వ్యక్తుల వివరాలను కూడా పరిశీలించే అవకాశం ఉంది.
ఏటీఎంలో చోరీ జరిగిన విషయాన్ని పోలీసులు యాక్సిస్ బ్యాంక్ అధికారులకు సమాచారం అందించారు. బ్యాంకు అధికారులు కూడా సతంరాయిలోని ఏటీఎం వద్దకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగులు ఎవరు, ఏ మార్గంలో వచ్చారు, చోరీ అనంతరం ఎటు వెళ్లారు అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
యాక్సిస్ బ్యాంక్ ఏటీఎం బద్దలు కొట్టి.. రూ.32 లక్షల చోరీ
14