టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ మరోసారి ప్రపంచ ట్రిలియనీర్ల జాబితాలోకి చేరారు. టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల షేర్ల విలువ ఇటీవల గణనీయంగా పెరగడంతో ఆయన నికర సంపద ఒక్కసారిగా భారీగా పెరిగింది. సోమవారం మస్క్ సంపద 65 బిలియన్ డాలర్లు పెరిగి మొత్తం 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. దీంతో ఈ ఏడాదిలో ఆయన సంపద ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం రెండోసారి అయింది.
ఈ నెల ప్రారంభం నుంచి స్పేస్ఎక్స్ సంస్థ షేరు విలువ సుమారు 13 శాతం పెరిగింది. అదే సమయంలో టెస్లా షేరు ధర కూడా 6.7 శాతం ఎగబాకింది. ఈ పరిణామాలు మస్క్ మొత్తం సంపద పెరగడానికి ప్రధాన కారణంగా నిలిచాయి. ఈ ఏడాది జూన్లో మస్క్ తొలిసారిగా ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్గా మారిన విషయం తెలిసిందే. స్పేస్ఎక్స్ ఐపీఓ నేపథ్యంలో సంస్థ షేర్లు భారీగా పెరగడంతో అప్పట్లో ఆయన సంపద ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అయితే సంస్థ మార్కెట్ విలువపై అంచనాలు అధికంగా ఉన్నాయనే అభిప్రాయాలతో షేర్ల అమ్మకాలు పెరిగి, మస్క్ సంపద మళ్లీ ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయింది.
ప్రస్తుతం స్పేస్ఎక్స్, టెస్లా షేర్లపై మదుపరులు ఆసక్తి చూపుతున్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో స్పేస్ఎక్స్ విశ్వసనీయ సంస్థగా ఎదుగుతున్న నేపథ్యంలో దాని షేర్లకు డిమాండ్ పెరుగుతోంది. మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోషల్ మీడియా వేదికలు కూడా పురోగతి సాధిస్తున్నాయని కథనం పేర్కొంది. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో టెస్లా కార్ల విక్రయాలు అంచనాలను మించాయి. మస్క్ నికర సంపదలో టెస్లా, స్పేస్ఎక్స్ షేర్ల వాటా 98 శాతంగా ఉంది.
మరోసారి ట్రిలియనీర్గా మస్క్.. టెస్లా, స్పేస్ఎక్స్ షేర్లతో భారీగా పెరిగిన సంపద
20
Published: 📅
Reported by: 🖊
Kanakadri