ఎయిడెడ్ పాఠశాలలను ప్రభుత్వం మూసివేస్తోందంటూ వచ్చిన ఆరోపణలపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టత ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చిన ఆయన, ఎయిడెడ్ పాఠశాలలను మూసివేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని తెలిపారు.
విద్యా రంగంలో తీసుకుంటున్న చర్యలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాల పరిస్థితిపై మంత్రి వివరాలు వెల్లడించారు. 2023-24, 2024-25 విద్యా సంవత్సరాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు మూడు శాతం తగ్గినట్లు తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025-26 విద్యా సంవత్సరంలో ప్రవేశాల తగ్గుదల 1.69 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు.
అదేవిధంగా 2026-27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు 0.94 శాతం పెరిగాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల అభివృద్ధి, నాణ్యమైన విద్య అందించడం, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.
ఎయిడెడ్ పాఠశాలల విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని, విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి స్పష్టం చేశారు. విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఎయిడెడ్ పాఠశాలలను మూసివేయడం లేదు.. శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి లోకేశ్
8
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan