ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ‘ఇండియా’ కూటమి ఎంపీలు ఢిల్లీలో నిరసన మార్చ్ చేపట్టారు. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం నిర్వాచన్ సదన్ వరకు పాదయాత్ర చేయాలని నిర్ణయించారు.
ఈ నిరసన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. విజయ్ చౌక్, ఆకాశవాణి పరిసర ప్రాంతాల్లో బహుళ అంచెల బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, అదనపు పోలీసు బలగాలను మోహరించారు. కూటమి ఎంపీలు ఉదయం పార్లమెంట్‌లోని మకర్ ద్వార్ వద్ద చేరి, అక్కడి నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లాలని నిర్ణయించారు.
కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, జైరామ్ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం అక్టోబర్ 8 వరకు వివిధ జిల్లాల్లో పాదయాత్రలు, సమావేశాలు నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్ 10 నుంచి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ పేరుతో దేశవ్యాప్తంగా ఆందోళనలను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రక్రియపై తీవ్ర ఆరోపణలు చేశారు. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఈ మార్చ్‌లో పాల్గొనడం లేదని, అయితే ఇదే అంశంపై తమ స్వంత మార్గంలో పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ తెలిపారు.
ఈ నిరసనలతో ఎన్నికల ప్రక్రియ, SIRపై రాజకీయ వివాదం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి.
సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి మార్చ్.. ఢిల్లీలో భారీ భద్రత
6
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk