ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులను పొందేందుకు ఎన్నికలను త్వరగా నిర్వహించాల్సిన అవసరం ఉందని కేబినెట్ అభిప్రాయపడింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ స్థానిక సంస్థల్లో (RLBs) బీసీలకు 34 శాతం రిజర్వేషన్, పట్టణ స్థానిక సంస్థల్లో (ULBs) బీసీలకు 33⅓ శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994 నిబంధనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ల అమలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో ఎలాంటి మార్పు ఉండదని కేబినెట్ స్పష్టం చేసింది. ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లు కొనసాగుతాయని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో మేయర్లు, చైర్మన్ల ఎన్నికలను ఇకపై ప్రత్యక్ష విధానంలో నిర్వహించే ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
జిల్లాల పునర్విభజనకు అనుగుణంగా జిల్లా పరిషత్‌ల సంఖ్యను 13 నుంచి 28కి పెంచే అంశంపైనా నిర్ణయం తీసుకుంది. కొత్త జెడ్పీల ఏర్పాటుకు అవసరమైన కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించింది. స్థానిక పాలనను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయాలు
7
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan
📍 ఆంధ్రప్రదేశ్