ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపాలిటీల విలీన ప్రక్రియపై కీలక వ్యాఖ్యలు చేశారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం పలు అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు.
న్యాయపరమైన అంశాల పరిష్కారం అనంతరం 23 మున్సిపాలిటీల విలీన ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. అయితే ముందుగా రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని స్పష్టం చేశారు. ఎన్నికలు ఆలస్యం అయితే కేంద్రం నుంచి రావాల్సిన అర్బన్ లోకల్ బాడీ నిధులు కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. అక్టోబర్‌లోగా ఎన్నికలు నిర్వహించకపోతే సుమారు రూ.12,150 కోట్ల నిధులపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలిపారు.
అదేవిధంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని నిత్యావసర ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రతికూల ప్రచారానికి సమర్థవంతంగా స్పందించాలని మంత్రులకు సూచించారు.
మద్యం బ్రాండ్‌లకు అభ్యంతరకరమైన పేర్లు పెట్టకుండా కమిటీ పరిశీలన చేయాలని సీఎం ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని, కంటైనర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలించే వారిపై నిఘా పెంచాలని అధికారులకు సూచించారు. స్థానిక పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఎన్నికల ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్థానిక ఎన్నికల తర్వాతే మున్సిపాలిటీల విలీనం.. సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
9
Published: 📅
Reported by: 🖊
Banu Prakash