ప్రముఖ శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత డాక్టర్ సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, ప్రఖ్యాత షెహనాయి విద్వాంసుడు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ వర్ధంతి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఘన నివాళులర్పించారు. దేశానికి, ప్రపంచానికి వారిద్దరూ అందించిన విశిష్ట సేవలను ఆయన స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ‘ఎక్స్’ వేదికగా వేర్వేరు పోస్టులు చేశారు. సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్ అసాధారణ ప్రతిభ కలిగిన శాస్త్రవేత్త అని పేర్కొన్నారు. నక్షత్రాలు, విశ్వం గురించి మానవ అవగాహనను విస్తరించేలా ఆయన చేసిన పరిశోధనలు శాస్త్ర చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని తెలిపారు.
ఖగోళ భౌతిక శాస్త్రంలో కీలకమైన ‘చంద్రశేఖర్ పరిమితి’ ఆవిష్కరణతో పాటు నక్షత్రాల నిర్మాణం, పరిణామంపై ఆయన చేసిన పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. 1983లో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి అందుకున్న చంద్రశేఖర్ ప్రపంచంలోని గొప్ప శాస్త్రవేత్తలలో ఒకరిగా నిలిచారని కొనియాడారు.
జ్ఞానాన్ని అన్వేషించాలనే తపన, కొత్త విషయాలను తెలుసుకోవాలనే పట్టుదల భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
అలాగే భారతీయ శాస్త్రీయ సంగీతంలో చెరగని ముద్ర వేసిన ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ సేవలను కూడా ఆయన గుర్తు చేసుకున్నారు. షెహనాయి వాయిద్యానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చిన బిస్మిల్లా ఖాన్ కళా ప్రస్థానం భారత సాంస్కృతిక వారసత్వంలో చిరస్థాయిగా నిలిచిపోతుందని తెలిపారు.
శాస్త్రం, సంగీత రంగాల్లో దేశ కీర్తిని ప్రపంచానికి చాటిన మహనీయుల సేవలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సుబ్రహ్మణ్యన్ చంద్రశేఖర్, బిస్మిల్లా ఖాన్‌ల సేవలు చిరస్మరణీయం: పవన్ కల్యాణ్ నివాళులు
16
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla