ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలి వర్షాకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. చివరి రోజు కూడా ఉభయ సభల్లో పలు కీలక అంశాలపై చర్చలు, బిల్లుల ఆమోదం, నివేదికల సమర్పణ జరగనున్నాయి.
జల కాలుష్య నివారణ, నియంత్రణ సవరణ చట్టం-2024ను ఆమోదించాలని కోరుతూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉభయ సభల్లో ఏకగ్రీవ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. దీంతోపాటు శాసనసభలో ప్రభుత్వం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును డిప్యూటీ సీఎం ప్రవేశపెట్టనుండగా.. ఒప్పంద ఉద్యోగుల సేవల క్రమబద్ధీకరణ సవరణ బిల్లును మంత్రి పయ్యావుల కేశవ్ సభ ముందుకు తీసుకురానున్నారు.
వన్యప్రాణులు, పర్యావరణ పరిరక్షణ కమిటీ నివేదికను కూడా ఉభయ సభల్లో ప్రవేశపెట్టనున్నారు. ఎమ్మెల్యేలు గొండు శంకరరావు, వేగేశన నరేంద్రవర్మ రాజు ఈ నివేదికను సమర్పించనున్నారు.
ఇక ‘సూపర్ సిక్స్’ హామీలు, ప్రజా సంక్షేమంపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇప్పటికే అసెంబ్లీలో ఆమోదం పొందిన కొన్ని బిల్లులకు శాసనమండలి ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేట్ నెట్‌వర్క్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు, గ్రామ పంచాయతీల్లో నిధుల దుర్వినియోగం, నిరుద్యోగ భృతి, తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణాల క్రమబద్ధీకరణ, భీమవరం సమీకృత కలెక్టరేట్ వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ నిధులు, తీరప్రాంత మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక పార్కులు, ఎరువుల కోసం యాప్‌లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల భవనాల నిర్మాణంపైనా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు.
ఏపీ అసెంబ్లీ, మండలి సమావేశాలకు నేడు ముగింపు.. కీలక బిల్లులు, ‘సూపర్ సిక్స్’పై చర్చ
10
Published: 📅
Reported by: 🖊
Kanakadri