హైదరాబాద్‌లో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణలపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ ఏడీ జయరాజు నివాసాలు, కార్యాలయాలకు సంబంధించిన ప్రాంతాల్లో అవినీతి నిరోధక శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
గురువారం తెల్లవారుజాము నుంచే ఏసీబీ అధికారులు సోదాలు ప్రారంభించారు. భూపాలపల్లితో పాటు హైదరాబాద్, సూర్యాపేట, తాండూరు ప్రాంతాల్లో మొత్తం 12 చోట్ల తనిఖీలు కొనసాగుతున్నాయి. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో అధికారులు బృందాలుగా విడిపోయి సోదాలు నిర్వహిస్తున్నారు.
ఈ తనిఖీల్లో జయరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలు, బ్యాంకు లావాదేవీలు, కీలక పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆదాయ మార్గాలు, ఆస్తుల విలువకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.
అవినీతి ఆరోపణలపై ప్రాథమిక సమాచారం ఆధారంగా ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది. సోదాలు పూర్తయిన తర్వాత స్వాధీనం చేసుకున్న పత్రాలు, ఆస్తుల వివరాలపై ఏసీబీ అధికారులు అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.
ప్రస్తుతం జయరాజు ఇళ్లతో పాటు సంబంధిత ప్రదేశాల్లో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనతో భూగర్భ గనుల శాఖలో చర్చ మొదలైంది.
అవినీతి ఆరోపణలు.. భూపాలపల్లి మైన్స్ ఏడీ జయరాజు ఇళ్లపై ఏసీబీ సోదాలు
8
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati