డ్రగ్స్ రవాణా కేసులో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్టు కావడం సంచలనంగా మారింది. ముంబైలోని శాంతాక్రూజ్‌కు చెందిన మాన్సీ సయ్యద్ వడోదర నుంచి ముంబైకి కారులో మెఫెడ్రోన్ డ్రగ్‌ను తరలిస్తున్నట్లు సూరత్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై మాటు వేసిన పోలీసులు ఓ టోల్‌ప్లాజా సమీపంలో ఆమె కారును అడ్డుకున్నారు.
కారును తనిఖీ చేయగా రూ.30 లక్షల విలువైన సుమారు 977 గ్రాముల మెఫెడ్రోన్ డ్రగ్ లభించినట్లు పోలీసులు తెలిపారు. మత్తుపదార్థాలతో పాటు మొబైల్ ఫోన్లు, ప్యాకింగ్‌కు ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు, కంటైనర్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మాన్సీ సయ్యద్‌తో పాటు ఆమె సహాయకుడు సోహైల్ సులేమాన్ షేక్‌ను అరెస్టు చేశారు.
మాన్సీ గతంలో మలేషియన్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేసినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగరీత్యా ఆమె పలు దేశాలకు ప్రయాణించినట్లు వెల్లడించారు. 2015 నుంచి డ్రగ్స్ సరఫరా నెట్‌వర్క్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు.
2021లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో డ్రగ్స్‌తో ఆమె పట్టుబడినట్లు, ఆ కేసులో దాదాపు నాలుగేళ్లు జైలులో గడిపినట్లు పోలీసులు తెలిపారు. తాజా కేసులో డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి సరఫరా చేయాల్సి ఉంది, నెట్‌వర్క్‌లో మరెవరు ఉన్నారనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.
రూ.30 లక్షల డ్రగ్స్‌తో మాజీ ఎయిర్ హోస్టెస్ అరెస్ట్.. గుజరాత్‌లో పట్టుకున్న పోలీసులు
6
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk