ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలను మరింత విస్తరించడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పెరిగాయి. అమెరికా తాజా ఆంక్షలను ఎదుర్కొనేందుకు తమ దేశం పూర్తిగా సిద్ధంగా ఉందని ఇరాన్ ఆర్థిక మంత్రి అలీ మదానిజాదే ప్రకటించారు. తమపై ఆర్థిక దాడి జరిగితే కేవలం రక్షణాత్మక చర్యలకే పరిమితం కాకుండా అవసరమైన ప్రతిచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అమెరికా విధిస్తున్న ఆంక్షలను మదానిజాదే ‘ఆర్థిక ఉగ్ర దాడి’గా అభివర్ణించారు. వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన మార్గాలు, సాధనాలు తమ వద్ద ఉన్నాయని, రెండేళ్లకు సరిపడే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని తెలిపారు. అమెరికా మరో పరాజయానికి సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించిన ఆయన, తాజా ఆంక్షలను చైనా, రష్యా కూడా అంగీకరించలేదని పేర్కొన్నారు.
అమెరికా ట్రెజరీ విభాగం ఆగస్టు 24న ఇరాన్‌పై కొత్త ఆర్థిక ఆంక్షలను ప్రకటించింది. మొత్తం 60 మంది వ్యక్తులు, సంస్థలు, నౌకలను లక్ష్యంగా చేసుకుని ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది. ఇరాన్‌కు అందుబాటులో ఉన్న ఆర్థిక మార్గాలను మరింత కట్టడి చేయడమే లక్ష్యమని అమెరికా తెలిపింది.
ఇరాన్‌తో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలు, సంస్థలు కూడా భవిష్యత్తులో ఆంక్షలకు గురయ్యే అవకాశం ఉందని వాషింగ్టన్ హెచ్చరించింది. ఆర్థిక ఒత్తిడి మరింత పెరిగితే గల్ఫ్ ప్రాంతం నుంచి చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ ఇప్పటికే హెచ్చరించింది.
అమెరికా ఆంక్షలకు ఇరాన్ కౌంటర్.. ప్రతిదాడికి పూర్తిగా సిద్ధమని హెచ్చరిక
8
Published: 📅
Reported by: 🖊
Kanakadri