విద్యా రంగంలో నాణ్యత పెంపు, ఉపాధ్యాయుల కొరతను అధిగమించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ ఏడాది డీఎస్సీ ద్వారా మరో 3 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.
విజయనగరంలో జరిగిన ఉపాధ్యాయుల క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ సమావేశంలో పాల్గొన్న మంత్రి.. విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు పూర్తయ్యాయని, ఇక ప్రధాన దృష్టి అభ్యసనా ఫలితాలపై ఉండాలని సూచించారు. విద్యార్థులు కేవలం పరీక్షల కోసం కాకుండా, ఆలోచించే సామర్థ్యం, సృజనాత్మకత, విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంచుకునేలా బోధన ఉండాలని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇప్పటికే పలు మార్పులు చేపట్టామని, వన్ క్లాస్ వన్ టీచర్ విధానం ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధన అందించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. డీఎస్సీ ద్వారా వేలాది టీచర్ పోస్టుల భర్తీతో ఉపాధ్యాయుల కొరత తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఉపాధ్యాయుల శిక్షణ, కొత్త బోధనా పద్ధతులపై కూడా ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఉత్తమ ఉపాధ్యాయులను విదేశాలకు పంపించి అక్కడి ఆధునిక బోధనా విధానాలను అధ్యయనం చేయించే కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
విద్యార్థులకు ఒత్తిడి లేని, ఆనందకరమైన అభ్యాస వాతావరణం కల్పించడమే లక్ష్యమని ఆయన చెప్పారు. నో బ్యాగ్ డే, క్రియేటివ్ క్లబ్‌లు, లీడర్‌షిప్ క్లబ్‌లు, సైన్స్, మ్యాథ్స్, స్పోర్ట్స్ క్లబ్‌ల ద్వారా విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
ఉద్యోగాల భర్తీతో పాటు విద్యా ప్రమాణాల పెంపు కూడా సమాంతరంగా కొనసాగితేనే రాష్ట్ర విద్యా వ్యవస్థ మరింత బలపడుతుందని నిపుణులు భావిస్తున్నారు.
ఈ ఏడాది మరో 3 వేల టీచర్ పోస్టులు.. విద్యా సంస్కరణలపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
3
Published: 📅
Reported by: 🖊
Banu Prakash