ప్రపంచ బాక్సింగ్ రంగంలో తనదైన ముద్ర వేసిన దక్షిణాఫ్రికా మాజీ ఛాంపియన్ జొలాని టెటే అకాల మరణం క్రీడా అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 38 ఏళ్ల టెటే తన నివాసం వద్ద గుర్తు తెలియని దుండగుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు.
అధికారుల సమాచారం ప్రకారం.. టెటే తన కారులో ఇంటికి చేరుకున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గేటు తెరుచుకునే వరకు ఆయన కారులో వేచి ఉండగా, ఇద్దరు దుండగులు వచ్చి కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో టెటే మరణించగా, కారులో ఉన్న ఓ మహిళ తీవ్రంగా గాయపడినట్లు సమాచారం.
జొలాని టెటే కేవలం బాక్సర్‌గా మాత్రమే కాకుండా, తన అసాధారణ ప్రతిభతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన క్రీడాకారుడిగా నిలిచారు. ఆయన డబ్ల్యూబీఎఫ్, డబ్ల్యూబీఓ ప్రపంచ టైటిళ్లను గెలుచుకున్నారు. 2017లో సిబోనిసో గోన్యాపై కేవలం 11 సెకన్లలో నాకౌట్ విజయం సాధించి ప్రపంచ టైటిల్ పోరులో అత్యంత వేగవంతమైన విజయాల్లో ఒకదాన్ని నమోదు చేశారు.
టెటే ప్రొఫెషనల్ కెరీర్‌లో 29 విజయాలు, 22 నాకౌట్లు నమోదు చేశారు. 2022లో జరిగిన చివరి పోరాటం తర్వాత తిరిగి బాక్సింగ్ రింగ్‌లోకి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
ఒక గొప్ప క్రీడాకారుడి జీవితం ఇలా ముగియడం బాక్సింగ్ ప్రపంచానికి తీరని లోటుగా మారింది. పోలీసులు ఈ హత్య వెనుక కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. టెటే సాధించిన విజయాలు, ఆయన పోరాట స్ఫూర్తి మాత్రం క్రీడా అభిమానుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.
ప్రపంచ ఛాంపియన్ జొలాని టెటే దారుణ హత్య.. బాక్సింగ్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసిన ఘటన
10
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk