భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల ప్రారంభం ఆలస్యమవుతున్న నేపథ్యంలో స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొందరు ప్రభావశీల వ్యాపార వర్గాలు తమ మార్కెట్ ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకుంటున్నాయని ఆయన ఎక్స్ వేదికగా ఆరోపించారు. అయితే ఆయన ఏ వ్యక్తి, సంస్థ లేదా టెలికాం కంపెనీ పేరును నేరుగా ప్రస్తావించలేదు.
భారత్‌లో ఇప్పటికీ వేలాది గ్రామాలకు పూర్తి స్థాయి 4G కనెక్టివిటీ అందుబాటులో లేదన్న పోస్టుకు స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. సంప్రదాయ మొబైల్ టవర్లు, ఫైబర్ నెట్‌వర్క్ చేరడం కష్టమైన మారుమూల ప్రాంతాల్లో స్టార్‌లింక్ ద్వారా వేగవంతమైన శాటిలైట్ ఇంటర్నెట్ అందించవచ్చని ఆయన వాదిస్తున్నారు.
స్టార్‌లింక్ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసినట్లు కంపెనీ చెబుతోంది. దేశవ్యాప్తంగా 20 గేట్‌వే సైట్లు, వందలాది యాంటెనాలు నిర్మించామని, భారత భద్రతా నిబంధనలకు అనుగుణంగా ప్రత్యేక వ్యవస్థలు సిద్ధం చేశామని స్టార్‌లింక్ ప్రతినిధులు తెలిపారు.
అయితే కమర్షియల్ సేవలు ప్రారంభించేందుకు ఇంకా తుది భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్ కేటాయింపు అవసరం ఉంది. ఇదే సమయంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ వంటి భారత టెలికాం కంపెనీల పేర్లు మీడియా నివేదికల్లో ప్రస్తావనకు వచ్చినప్పటికీ, మస్క్ వాటిని నేరుగా ఆరోపించలేదు. సంబంధిత కంపెనీలు కూడా తాజా వ్యాఖ్యలపై వెంటనే స్పందించలేదని కొన్ని నివేదికలు పేర్కొన్నాయి.
స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారు.. భారత టెలికాం మార్కెట్‌పై మస్క్ సంచలన ఆరోపణలు
2
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan