పట్నా నుంచి లఖ్నవూ వెళుతున్న ఇండిగో విమానం గగనతలంలో పిడుగుపాటుకు గురికావడంతో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. బుధవారం జరిగిన ఈ ఘటన సమయంలో విమానంలో 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అదృష్టవశాత్తూ వారంతా సురక్షితంగా బయటపడ్డారు.
విమానం సుమారు 17 వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తుండగా పిడుగు తాకినట్లు సమాచారం. దీంతో విమానం ముందు భాగంలో స్వల్ప నష్టం ఏర్పడింది. పరిస్థితిని గమనించిన పైలట్లు ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని ఉత్తరప్రదేశ్‌లో అత్యవసరంగా దించారు.
ల్యాండింగ్ అనంతరం ప్రయాణికులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దర్యాప్తు ప్రారంభించింది. ప్రస్తుతం విమానాన్ని సాంకేతిక తనిఖీలు, మరమ్మతుల కోసం సర్వీస్ నుంచి తాత్కాలికంగా తప్పించారు. అవసరమైన క్లియరెన్స్ వచ్చిన తర్వాతే మళ్లీ వినియోగంలోకి తీసుకురానున్నారు.
విమానాలు సాధారణంగా పిడుగుపాటును తట్టుకునేలా ప్రత్యేక రక్షణ వ్యవస్థలతో రూపొందించబడతాయి. అయినప్పటికీ పిడుగుపాటు తర్వాత విమాన నిర్మాణం, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, కమ్యూనికేషన్ పరికరాలను పూర్తిగా తనిఖీ చేయడం తప్పనిసరి.
గత నెలలో కూడా మరో ఇండిగో విమానం బెంగళూరులో ల్యాండింగ్ సమయంలో టెయిల్ భాగం రన్‌వేను తాకి స్వల్పంగా దెబ్బతిన్న ఘటన చోటుచేసుకుంది. తాజా ఘటనతో విమాన భద్రతా తనిఖీలు మరోసారి చర్చకు వచ్చాయి.
గగనతలంలో ఇండిగో విమానంపై పిడుగుపాటు.. అత్యవసర ల్యాండింగ్
0
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk