సంగారెడ్డి జిల్లాలో గోల్డ్, సిల్వర్ వ్యాపారం పేరుతో భారీ పెట్టుబడి మోసం వెలుగులోకి వచ్చింది. అధిక లాభాలు ఇస్తామని నమ్మించి పలువురు వ్యక్తుల నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించిన ‘నైకీ ట్రేడర్స్’ సంస్థ నిర్వాహకులు డబ్బులు తిరిగి చెల్లించకుండా తప్పించుకున్నట్లు బాధితులు ఆరోపించారు.
హైదరాబాద్‌లోని సంస్థలో పెట్టుబడులు పెట్టిన జహీరాబాద్‌కు చెందిన సుమారు 25 మంది వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. గోల్డ్, సిల్వర్ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని సంస్థ ప్రతినిధులు తమను నమ్మించారని బాధితులు తెలిపారు. దీంతో వారు విడతల వారీగా సంస్థలో డబ్బులు జమ చేసినట్లు పేర్కొన్నారు.
కొంతకాలం పాటు వ్యవహారం సజావుగా సాగినప్పటికీ, ఆ తర్వాత వడ్డీతో పాటు అసలు మొత్తాన్ని కూడా తిరిగి చెల్లించకుండా సంస్థ నిర్వాహకులు తప్పించుకున్నారని బాధితులు ఆరోపించారు. పలుమార్లు డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరినా స్పందన లేకపోవడంతో జహీరాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ నుంచి సేకరించిన మొత్తం సుమారు రూ.28 కోట్లు అని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. బాచుపల్లికి చెందిన శేషవర్ధన్‌రెడ్డి, రవీందర్‌బాబు, జగదీశ్, సుస్మితను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం రిమాండ్‌కు తరలించారు.
అయితే ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? బాధితుల నుంచి వాస్తవంగా ఎంత మొత్తం సేకరించారు? ఆ డబ్బును ఎక్కడికి తరలించారు? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోల్డ్, సిల్వర్ వ్యాపారం పేరుతో అధిక రాబడుల ఆశ చూపి భారీగా పెట్టుబడులు సేకరించిన ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపుతోంది.
రూ.28 కోట్ల గోల్డ్-సిల్వర్ స్కామ్.. 25 మందిని నమ్మించి ‘నైకీ ట్రేడర్స్’ బోర్డు తిప్పేసిందా?
12
Published: 📅
Reported by: 🖊
Banu Prakash