విదేశాల్లో ఉన్నత విద్య చదవాలనుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఓవర్సీస్ విద్యానిధి పథకాలు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి. అధిక ఖర్చుల కారణంగా విదేశీ విద్యకు దూరమవుతున్న పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి.
ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం అమలవుతోంది. ఎంపికైన విద్యార్థులకు రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్‌తో పాటు విమాన, వీసా ఖర్చులను కూడా ప్రభుత్వం భరిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి. కుటుంబంలో ఒక్క విద్యార్థికే పథకం వర్తిస్తుంది. గ్రాడ్యుయేషన్‌లో కనీసం 60 శాతం మార్కులు సాధించాలి. అవసరమైన GRE, GMAT, TOEFL, PTE వంటి అర్హత పరీక్షల్లో కూడా నిర్ణీత ప్రమాణాలు సాధించాల్సి ఉంటుంది.
బీసీ, ఈబీసీ విద్యార్థులకు మహాత్మా జ్యోతిబాఫూలే ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రూ.20 లక్షల వరకు స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. ఈ పథకానికి కూడా కుటుంబ వార్షిక ఆదాయం రూ.5 లక్షలలోపు ఉండాలి.
అర్హులైన విద్యార్థులు అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, సింగపూర్, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సహా పలు దేశాల్లో ఉన్నత విద్య చదివే అవకాశం పొందవచ్చు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధికి ఆసక్తి గల విద్యార్థులు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలని సమాచారం.
విదేశీ చదువులకు రూ.20 లక్షల వరకు సాయం.. తెలంగాణ విద్యార్థులకు ఓవర్సీస్ విద్యానిధి భరోసా
1
Published: 📅
Reported by: 🖊
Venkata Dodla