మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో డ్రగ్ ఇన్‌స్పెక్టర్ (గ్రూప్-బి) పోస్టుల భర్తీకి నిర్వహించిన నియామక ప్రక్రియను రద్దు చేసింది. మార్చి 22, 2026న నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ను MPSC 2025 జూలై 29న విడుదల చేసింది. అనంతరం మహారాష్ట్రలోని ఆరు డివిజనల్ కేంద్రాల్లో ఆఫ్‌లైన్ స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. పరీక్ష ఫలితాల అనంతరం 506 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూలకు అర్హత సాధించగా, 488 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు.
అయితే పరీక్షకు రెండు రోజుల ముందే ప్రశ్నలు కొందరికి చేరాయని, అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయని ఫిర్యాదులు అందాయి. దీంతో MPSC ముంబై పోలీసులను ఆశ్రయించింది. క్రైమ్ బ్రాంచ్ ప్రాథమిక విచారణలో కనీసం ఒక అభ్యర్థికి ప్రశ్నల సెట్ ముందుగానే అందినట్లు గుర్తించినట్లు సమాచారం.
పరీక్ష పారదర్శకత, నిష్పాక్షికతను కాపాడేందుకు మొత్తం నియామక ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు MPSC ప్రకటించింది. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులకు మళ్లీ దరఖాస్తు అవసరం లేదని, రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని తెలిపింది. కొత్త పరీక్ష తేదీని త్వరలో ప్రకటించనుంది. రీ-ఎగ్జామ్ కోసం అభ్యర్థుల నుంచి అదనపు ఫీజు వసూలు చేయబోమని స్పష్టం చేసింది.
డ్రగ్ ఇన్‌స్పెక్టర్ నియామక పరీక్ష రద్దు.. పేపర్ లీక్ ఆరోపణలపై MPSC కీలక నిర్ణయం
3
Published: 📅
Reported by: 🖊
Eswar Pavan