పేదలు, అనాథలు, నిరాశ్రయుల సేవకు తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మానవతావాది మదర్ థెరిసా జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రేమ, కరుణ, సేవా భావానికి ప్రతీకగా నిలిచిన మదర్ థెరిసా నిస్వార్థ సేవలను స్మరించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందిస్తూ.. పేదరికం, ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న నిస్సహాయులను మదర్ థెరిసా అక్కున చేర్చుకుని సేవలు అందించారని పేర్కొన్నారు. సాటి మనిషిలోని బాధను తొలగించడమే నిజమైన దైవత్వమని ఆమె జీవితం ద్వారా నిరూపించారని తెలిపారు.
మదర్ థెరిసా సేవలు మానవత్వానికి చిరస్థాయిగా నిలిచే ఆదర్శమని సీఎం పేర్కొన్నారు. ఆమె చూపిన మార్గంలో నడుస్తూ సమాజంలోని పేదలు, అవసరంలో ఉన్న వారికి అండగా నిలవాలని సూచించారు.
ఇదిలా ఉండగా, విశాఖలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కూడా మదర్ థెరిసా జయంతి సందర్భంగా నివాళులర్పించారు. పేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆమె అందించిన సేవలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. మానవత్వం, సేవా భావాలను ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు.
మదర్ థెరిసా నిస్వార్థ సేవలను స్మరించుకుందాం: సీఎం చంద్రబాబు నివాళి
3
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati