హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ పేరుతో జరిగిన సైబర్ మోసం సంచలనం సృష్టించింది. 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగిని సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. తాము నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) అధికారులమని నమ్మిస్తూ బాధితుడికి ఫోన్ చేశారు. ఆయన ఆధార్ వివరాలను ఉపయోగించి రూ.2.50 కోట్ల మోసం జరిగిందని, ఈ కేసులో తాను చిక్కుకున్నానని భయపెట్టారు.
కేసు నుంచి బయటపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వెరిఫికేషన్ అవసరమని చెప్పి, బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.85.20 లక్షలను ఒక నిర్దిష్ట ఖాతాలో జమ చేయాలని సూచించారు. నిందితుల మాటలను నమ్మిన బాధితుడు మొత్తం డబ్బును వారు చెప్పిన ఖాతాకు బదిలీ చేశారు.
తర్వాత మరో రూ.42 లక్షలు చెల్లించాలని నిందితులు డిమాండ్ చేయడంతో బాధితుడికి అనుమానం వచ్చింది. తాను సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ సైబర్ పోలీసులు వెంటనే స్పందించి కోయంబత్తూరులోని బ్యాంక్ ఖాతాను గుర్తించారు. అందులో ఉన్న రూ.85.20 లక్షలను ఫ్రీజ్ చేశారు. నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగుతోంది.
అపరిచిత వ్యక్తులు పోలీసు అధికారులు, బ్యాంకు సిబ్బంది పేరుతో ఫోన్ చేస్తే ఎలాంటి డబ్బులు పంపకుండా అధికారిక మార్గాల్లో నిర్ధారించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.
డిజిటల్ అరెస్ట్ స్కామ్: రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి నుంచి రూ.85 లక్షల మోసం)
3
Published: 📅
Reported by: 🖊
Jasmin Sk