సూర్యాపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్‌ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 12 మంది గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలని అధికారులను సూచించారు.
ఈ ప్రమాదంపై మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.
ప్రమాద స్థలాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ కె. నరసింహ పరిశీలించారు. ప్రాథమిక దర్యాప్తులో బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు ఎస్పీ తెలిపారు. గాయపడిన వారిని ఖమ్మం, విజయవాడ, కోదాడ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల కుటుంబాలకు సీఎం రేవంత్‌రెడ్డి సానుభూతి
12
Published: 📅
Reported by: 🖊
Subba Lagadapati